ఇంగ్లీషు ప్రపంచ భాష.
మనం ఏ ఇతర ప్రదేశానికి వెళ్లినా, ఆ ప్రదేశంలో మాట్లాడే భాష మనకి తెలియదు. ఒకరి భాషను ఇంకొకరు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇద్దరికీ అర్థమయ్యే అనుసంధాన భాష ఒకటి అవసరం అవుతుంది. ఆ కొరత ఇంగ్లీషు భాష తీర్చింది.
చాలా దేశాల వారు ఇంగ్లీషు భాష నేర్చుకుంటున్నారు. వర్తకానికిగాని, వ్యాపారానికి గాని, శాస్త్ర విషయాల్ని తెలుసుకోవడానికి గాని ఇంగ్లీషు భాష చాలా అవసరం. అనేక దేశాల శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలనన్నింటినీ ఇంగ్లీషు భాషలోనే భద్రపరిచారు. వాటిని గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లీషు భాషా జ్ఞానం చాలా అవసరం.
ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లీషు భాష ప్రాధాన్యత కలిగి ఉంది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికే కాదు, ఉన్నత పదవుల్ని సాధించడానికి కూడా ఇంగ్లీషు భాష తోడ్పడుతూంది. ఎందుకంటే, ఇంటర్వూలు కూడా ఇంగ్లీషులోనే జరుగుతున్నాయి. అంతే కాక, విదేశాలకు వెళ్తే అక్కడ ఇంగ్లీషే శరణ్యం అవుతుంది.
మన పాఠశాలల్లో ఇంగ్లీషు నేర్పుతున్నారు. ఇంగ్లీషులో ప్రమాణాలు దిగజారిపోతున్నాయనేది నిర్వివాదాంశం. మాతృభాష ద్వారా విద్యాబోధన జరగుతూ ఉండడటమే దీనికి కారణం అని కొందరి అభిప్రాయం. మొదటి స్థానం మాతృభాషదే అయినా, మాతృభాష మూలంగా ఇంగ్లీషుని నిర్లక్ష్యం చేయకూడదు. కాలేజీలో చేరిన వెంటనే ఇంగ్లీషులోనే ఎక్కువగా విద్య బోధన జరగుతూంది. అయితే అందరికీ సులభంగా అవగాహన కాగలిగిన మంచి పుస్తకాలు మాతృభాషలో ఇంకా వెలువడలేదు. అందువల్ల ఇంగ్లీషుని నిర్లక్ష్యం చేయవద్దు.
పైగా యూనివర్సిటీలలో ఎక్కువ ప్రమాణాలు గల ఇంగ్లీషు కావలసి వస్తూంది. అన్ని సబ్జెక్టులలోను చాలా ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగే విద్యార్థులు ఇంగ్లీషులో కనీస మార్కులు కూడా తెచ్చుకోలేక పోతున్నారు. అందుకే చిన్న తరగతుల నుండి కూడా ఇంగ్లీషు భాషని నేర్పాలని ప్రభుత్వం ఆదేశాల్ని జారీ చేసింది. భవిష్యత్తులో ఇంగ్లీషుని నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది.
మన భావాల్ని ఇతరులకు తెలియజేయడానికి భాష అవసరం. భాష భావాన్ని తెలియజేయడానికి సాధనం. ఇంగ్లీషు భాషని నేర్చుకోవాలంటే, దానికి పునాది అయిన గ్రామర్ నేర్చుకోవాలి. భాష ద్వారా భావాన్ని తెలియజేయడానికి సాధనం వాక్యం. వాక్యాన్ని నిర్మించడానికి పదాలు అవసరం. పదాల్ని కూర్చడానికి అక్షరాలు కావాలి. కాబట్టి గ్రామర్ లో భాషకి మూలమైన అక్షరాలు, వాటి ద్వారా పదాల నిర్మాణం, వాటి నుండి వాక్యాల నిర్మాణం తెలుస్తుంది. అందువల్ల అక్షరాలతో మొదలుపెట్టి, వాక్య నిర్మాణం ఎలా చేయాలో, ఆ వాక్యాల్ని అందంగా ఎలా సమకూర్చాలో, ఏ పదం ఎక్కడ ఉపయోగిస్తే భాషకి అందం వస్తుందో అర్థం చేసుకోవడానికి భాష ఉపయోగపడుతుంది. అంటే గ్రామర్ ఉపయోగ పడుతుంది.
గ్రామర్ లో వాక్య నిర్మాణాలు ఎలా చెయ్యాలో నియమాలున్నాయి. ఆ నియమాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గ్రామర్ అనగానే పదాల వరుస క్రమం, పదాల నిర్మాణం, వాక్యాల నిర్మాణం మొదలైనవి మనస్సులో మెదుల్తాయి. అంతేకాదు, Alphabet ఎలా రాయాలో అన్న దగ్గర్నుంచీ గ్రామర్ మొదలవుతుంది. వాటినన్నింటినీ అవగాహన చేసుకుంటేనే, తప్పులు లేకుండా వాక్యాన్ని నిర్మించగలం. అప్పుడే భాషా స్వరూపం తెలుస్తుంది.
భాషని నేర్చుకోవడం వల్ల మనకి కలిగే లాభం ఏమిటి ?
చక్కని భాషని ఉపయోగించి ఒక పేరాగ్రాఫ్, ఒక ఉత్తరం, ఒక కథ, ఒక వ్యాసం నిర్మించగలుగుతాం. అలంకారాలు, జాతీయాలతో వాక్యాన్ని నిర్మించగలిగితే అది సాహిత్యపు విలువల్ని సంతరించుకోగలుగుతుంది.
గ్రామర్ అంటే భాషా శాస్త్రం.
కాబట్టి నిర్థిష్టమైన ఇంగ్లీషు భాష రావాలంటే దానికి పునాదియైన గ్రామర్ ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. లోతులకి పోయి చక్కగా అవగాహన చేసుకోవాలి. ఎంతయినా ఇంగ్లీషు పరభాష కదా ? శాస్త్రాన్ని శాస్త్రీయంగానే నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే ఇంగ్లీషుని శాస్త్రీయంగా, క్రమపద్దతిలో అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీషుని ఇంగ్లీషులోనే నేర్పాలి అనేది సమంజసం అయిన వాదన కాదు. ఎందుకంటే, మాతృభాషలో అర్థమయినట్లుగా ఇంగ్లీషులోనే బోధిస్తే సరియైన అవగాహన ఉండదు.
కాబట్టి భాష నిర్దిష్టంగా ఉండాలంటే దానికి మూలమై, నియమాలతో కూడుకున్న గ్రామర్ ని సరిగా అవగాహన చేసుకోవాలి. దానితోపాటు భాష అభివృద్ధి కావడానికి పదజాలం, వస్తువులతో పరిచయం, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, కర్తరి, కర్మణి ప్రయోగాలు, ప్రత్యక్ష, పరోక్ష కథనాలు మొదలైన వివరాలెన్నో తెలుసుకొని అభ్యసించాలి.
అక్షరాలు రాయడం మొదలుకొని పేరాలు, కథలు, ఉత్తరాలు, వ్యాసాలు మొదలైన వాటిని అలంకారాలతో, జాతీయాలతో వ్రాయడం వరకు ఒక క్రమపద్ధతిలో వివరించడం జరుగుతుంది.
శ్రద్ధగా చదివి, అర్థం చేసుకుని, అభ్యాసాలు చేస్తే ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించగలరు.
REST IN NEXT
0 Responses to ఇంగ్లీషు ప్రపంచ భాష - ఉపోద్ధాతం